- బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలపై తనిఖీలు కంటిన్యూ
హైదరాబాద్, వెలుగు: రోజురోజుకూ పెరుగుతున్న సన్నబియ్యం రేట్లకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర సర్కారు కఠిన చర్యలకు దిగింది. సన్నబియ్యానికి ధరలను నిర్దేశించింది. సర్కారు ఆదేశాల మేరకు ఆయా రకాలను బట్టి కిలోకు రూ.66 నుంచి రూ.79 వరకు రేట్లు ఖరారు చేస్తూ పౌరసరఫరాల శాఖ శనివారం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకుపైగా ఎక్కువ తీసుకోరాదని వ్యాపారులు, మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఇటీవల బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం రేట్లు భారీగా పెరిగాయి. సూపర్‌ఫైన్ రకం కిలో రూ.95 వరకు, మీడియం రకం రూ.90, ఫైన్ రకం రూ.80 వరకు విక్రయిస్తున్నారు. ఈ ధరల పెరుగుదలపై ప్రజల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాపారులు, మిల్లర్లు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ధరల పెరుగుదలకు కారణాలు, మార్కెట్‌లో బియ్యం నిల్వలు, సరఫరా పరిస్థితులను సమీక్షించారు. ఆయన సూచనల మేరకు న్న బియ్యానికి గరిష్ట చిల్లర ధరలను ఖరారు చేశారు.
నిర్ణయించిన ధరలకే అమ్మాలి..
సివిల్ సప్లయ్స్ శాఖ మార్గదర్శకాల ప్రకారం బీపీటీ, కేఎన్‌ఎం రకాల బియ్యం కిలో రూ.66 , తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్) రకం రూ.74 , హెచ్‌ఎంటీ, జై శ్రీరాం రకాల బియ్యం రూ.79 , అంతకన్నా తక్కువకే విక్రయించాల్సి ఉంటుంది. ఈ ధరలకు మించి అమ్మకాలు జరిపితే ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా సన్న బియ్యం పేరుతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. నిర్ణయించిన ధరలు మార్కెట్‌లో అమలయ్యేలా పర్యవేక్షణ చేపట్టాలని సూచించింది
